AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: ఆ యువకుడి మాటలు మర్చిపోలేను – పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం విజయవాడలో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సాగిన ఈ ప్రయాణంలో వారు దివ్యాంగులతో కలిసి కూర్చుని, వారి సమస్యలను, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రయాణంలో జేఎన్‌టీయూలో చదువుతున్న ఒక దివ్యాంగ యువకుడితో పవన్ కళ్యాణ్ జరిపిన సంభాషణ ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ యువకుడు నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ప్రతిపాదించిన ‘డబుల్ హ్యాండికాప్’ అంశాన్ని ప్రస్తావించాడని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే దివ్యాంగులు సమాజంలో రాణించాలంటే రెండింతల ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందని, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆ భారాన్ని తగ్గించడమే కాకుండా తాము దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తుందని ఆ యువకుడు చెప్పిన మాటలు తనపై చెరగని ముద్ర వేశాయని ఆయన పేర్కొన్నారు.

‘దివ్యాంగ శక్తి’ అనేది కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదని, అది దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక పెట్టుబడిగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు గమ్యాన్ని ఎలా చేరుకోవాలనే ఆందోళన లేకుండా ఈ పథకం భరోసా ఇస్తుందని ఆయన అన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆ యువకుడితో సాగిన సంభాషణ తనకు గుర్తుచేసిందని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలమనే ఉన్నతమైన ఆలోచన దివ్యాంగ యువతలో ఉండటం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.

ANN TOP 10