పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవలే తన స్వగ్రామమైన సియాల్‌కోట్ కంటోన్మెంట్‌లో ఒక ‘పిజ్జా హట్’ అవుట్‌లెట్‌ను అత్యంత ఘనంగా ప్రారంభించారు. రెడ్ రూఫ్ లోగో, పిజ్జా హట్ బ్రాండింగ్‌తో అచ్చం ఒరిజినల్ ఫ్రాంచైజీలా ఉన్న ఆ షాపును మంత్రి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు కథ బయటపడింది. ఆ అవుట్‌లెట్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని పిజ్జా హట్ పాకిస్థాన్ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో మంత్రి గారు ఒక్కసారిగా అభాసుపాలయ్యారు.
పిజ్జా హట్ పాకిస్థాన్ తన ప్రకటనలో స్పష్టం చేసిన అంశాలు:
-
అనధికారిక అవుట్‌లెట్: సియాల్‌కోట్ కంటోన్మెంట్‌లో ప్రారంభమైన ఈ అవుట్‌లెట్ పిజ్జా హట్ పేరును, బ్రాండింగ్‌ను అక్రమంగా వాడుకుంటోంది.
-
సంబంధం లేదు: ఈ షాపుకు పిజ్జా హట్ పాకిస్థాన్ లేదా దాని మాతృ సంస్థ ‘యమ్! బ్రాండ్స్’ (Yum! Brands) తో ఎలాంటి చట్టపరమైన సంబంధం లేదు.
-
ప్రమాణాలు లేవు: ఈ నకిలీ అవుట్‌లెట్ అంతర్జాతీయ వంటక విధానాలు, నాణ్యత మరియు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించదు.
-
అధికారిక షాపులు: ప్రస్తుతం పాకిస్థాన్‌లో కేవలం 16 అధికారిక పిజ్జా హట్ అవుట్‌లెట్లు మాత్రమే ఉన్నాయి (14 లాహోర్‌లో, 2 ఇస్లామాబాద్‌లో). సియాల్‌కోట్‌లో తమకు అసలు బ్రాంచీనే లేదని కంపెనీ తేల్చి చెప్పింది.
ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. “ఒక దేశ రక్షణ మంత్రి కనీసం అది నకిలీదో కాదో తెలుసుకోలేరా?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “పాకిస్థాన్‌లో బడ్జెట్ నుంచి పిజ్జాల వరకు అన్నీ నకిలీవే” అంటూ మీమ్స్‌తో ఆటాడుకుంటున్నారు. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై కంపెనీ ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో, ఆ నకిలీ అవుట్‌లెట్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.









