AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెట్టుబడుల వేట.. విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

నిధులే లక్ష్యం.. అభివృద్ధే ముఖ్యం
విదేశి పర్యటనలో సీఎం బృందం
రేపు మంత్రి శ్రీధర్‌ బాబు..
ఎల్లుండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అమెరికాకు..
బడా పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు!

(అమ్మన్యూస్,హైదరాబాద్‌):
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. రేపు మంత్రి శ్రీధర్‌ బాబు, ఎల్లుండి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అమెరికాకు వెళ్తారు. అమెరికాలో పలు నగరాల్లో పర్యటించి మల్టీనేషనల్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రజంటేషన్‌∙ఇవ్వనున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పెద్దఎత్తున విదేశీ కంపెనీల ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా మూసీ ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని అనుకుంటున్నారు.

రెండోసారి విదేశిపర్యటనకు..
ఫార్మా, టెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ కు ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గతంలో దావోస్‌ లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు జనవరిలో రేవంత్‌ హాజరయ్యారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇటీవల మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌ బాబు అమెరికాలో పర్యటించారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. ఈ అమెరికా పర్యటనలో ఎన్‌ఆర్‌ఐలతోనూ సీఎం సమావేశం అవుతారని సమాచారం. అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని ఫాలోప్‌ చేసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తిరిగి ఆగస్టు 14న హైదరాబాద్‌కు రానున్నారు.

సీఎం పర్యటన వివరాలు..

– 4న న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
– 5న న్యూయార్క్‌లో కాగ్నిజెంట్‌ సీఈవోతో, సిగ్నా సీనియర్‌ అధికారి, ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్‌ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్‌ వో సంస్థ సీవోవో శైలేష్‌ జెజురికర్, ర్యాపిడ్‌ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు.
– 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు.
– 7న ఛార్లెస్‌ స్క్వాబ్‌ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఉంటాయి.
– 8న కాలిఫోర్నియాలో ట్రినెట్‌ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశం, సెలెక్ట్‌ టెక్‌ యూనికార్న్స్‌ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్‌ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు.
– 9న గూగుల్‌ సీనియర్‌ ప్రతినిధులతో భేటీ, స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ సెంటర్‌ సందర్శన, అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్, జెడ్‌ స్కేలర్‌ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్‌ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలుస్తారు.
– 10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్‌ చేరుకుంటారు.
– 12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్‌ హోల్డింగ్స్, హ్యుందాయ్‌ మోటార్స్‌ ప్రతినిధులతో, పలువురు ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.
– 13న హాన్‌ రివర్‌ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్‌ జూ యంగ్‌ టాయ్‌తో భేటీ, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు, హాన్‌ రివర్‌ ఫ్రంట్‌ సందర్శన ఉంటాయి.
– 14న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

ANN TOP 10