(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమర్థించారు. తెలంగాణలో వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ
సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన వెంటనే.. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది చాలా గొప్ప తీర్పు అని అన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్లకు కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఈ మేరకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని రేవంత్ ప్రకటించారు.
ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది..
‘మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్ 23న భట్టివిక్రమార్క, దామోదర రాజ నర్సింహ అడ్వకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.’ అని రేవంత్ రెడ్డి సభలో వెల్లడించారు.









