హనుమాన్ మందిర్ లో అతివల గోరింటాకు సంబరం
ఇది మన సంప్రదాయం- కంది మౌనా శ్రీనివాస రెడ్డి
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్‌నగర్ హనుమాన్ ఆలయంలో సోమవారం కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢ మాస సంబరాలు నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు తయారు చేశారు. తొలుత గౌరీదేవి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహిళలు పాటలు పాడుతూ ఒకరికొకరు చేతులకు గోరింటాకును అలంకరించుకున్నారు. ఇది అనాదిగా వస్తున్న మన సంప్రదాయమని కంది మౌనా శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ఈ గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలుంటాయని అన్నారు. రోజంతా నీటిలో పనిచేసే గృహిణులకు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో చర్మవ్యాధులు ప్రబలకుండా కాపాడుతుందని తెలిపారు. ఇలా అంతా కలిసి గోరింటాకు సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










