AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటల ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఈటెల తీవ్రంగా స్పందించారు. అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నా కూల్చివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి నియంతృత్వ పోకడలకు పోయే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

ప్రియ ఎన్ క్లేవ్‌లో ఇళ్లు నిర్మించుకున్న వారంతా చిన్నచిన్న ఉద్యోగులు, చిరువ్యాపారులు, పేదలే అని ఈటెల తెలిపారు. ఒకవేళ ఇవి అక్రమ భూములే అయితే జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీని వెనక రాజకీయకుట్ర దాగి ఉందని ఈటెల ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్న స్థలం ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రామ్ దాస్ గౌడ్ నుంచే బాధితులంతా కొనుగోలు చేశారని, పోచయ్య అనే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతోనే వివాదానికి తెరతీశారని ఆరోపించారు. భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదంటే కేసులు పెట్టి జైళ్లకు పంపాలని చూసిన గత బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో 300మంది రోడ్డున పడ్డారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఉన్నా సరే పేదల ఇళ్లు కూల్చిన ఎమ్మార్వో, ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురి మంత్రులకు ఫోన్ చేసినా స్పందించ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందనే ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు కాంగ్రెస్‌ను గెలిపిస్తే వీరు అంతకు మించి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ANN TOP 10