నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బుధవారం (జూన్ 5) సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షం కురవడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో అమీర్‌పేట, పంజాగుట్ట, ఎల్బీనగర్, మియాపూర్, ఉప్పల్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌లో ఎగ్జిట్ మెషిన్లు మొరాయించాయి. స్టేషన్‌లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. మెట్రో సిబ్బందితో గొడవకు దిగారు.
పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కస్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.









