బీజేపీకి అవయవదానం చేసి గెలిపించిండు
7 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు
ఎంపీ ఫలితాలు సంతృప్తికరం
కంటోన్మెంట్ విజయంతో మరింత బలం
ఇక అభివృద్ధిపై ఫోకస్
సీఎం రేవంత్ కీలక కామెంట్స్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
‘గులాబీ దళపతి కేసీఆర్ జూదగాడు.. బీజేపీకి అవయవదానం చేసిండు.. ఆత్మబలిదానం చేశారు.. పూర్తిగా గులాంగిరీ చేశారు.. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు, సీట్లు పెరిగాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పారు. అందుకే అసెంబ్లీ కంటే ఎక్కవ ఓటు షేర్ సాధించామని చెప్పారు. గత ఎన్నికల్లో 3 స్థానాలు గెలిస్తే ఈసారి 8 స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని దుయ్యబట్టారు.
తెంలగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనకు ఈ ఫలితాలు రెఫరెండం అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 38 శాతం ఓట్లు రాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో 42 శాతానికి పెరిగిందన్నారు. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోగా.. ఈ దఫా 8 స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. తమ అభ్యర్థులు ఓడిపోయిన మరో 8 స్థానాల్లో భారీగా ఓట్లు రాబట్టమన్నారు. ఓట్ల శాతం పెంచుకోవటం ద్వారా తమ పరిపాలన బాగుందని తెలిసిందన్నారు. ఓట్లు, సీట్లు పెంచి ప్రజలు తమను ఆశీర్వదించారని చెప్పారు.
119 అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధించిన 64 సీట్లలో మెజార్టీ రావటమే కాకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించారన్నారు. ఆ సీటుతో కలుపుకుంటే అసెంబ్లీతో తమ బలం మరింత పెరిగిందని చెప్పారు. ప్రజలకు మద్దతు తమకే ఉందనే విషయం ఈ విజయంతోనూ స్పష్టమైందన్నారు. ఇంతటి విజయాన్ని కట్టబెట్టినందుకు గాను.. పీసీసీ అధ్యుక్షుడిగా, సీఎంగా.. ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
ఇక బీజేపీ కూడా గణనీయంగా సీట్లు, ఓట్లు పెంచుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. 4 సీట్ల నుంచి 8 స్థానాలను పెంచుకోవటంతో పాటు.. ఓట్ల శాతాన్ని కూడా 20 నుంచి 35 శాతానికి పెంచుకుందని చెప్పారు. ఈ ఫలితాలు వారి నాయకత్వంతో వచ్చినవి కావని.. బీఆర్‌ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకొని బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారన్నారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో 7 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారన్నారు. ఒక్క మెదక్ నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకున్నారన్నారు.
తమ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ నేతలతో బీఆర్‌ఎస్ పార్టీ తెర వెనుక ఒప్పందం చేసుకుందన్నారు. అందులో భాగంగానే.. భారీగా ఓట్ల బదిలీ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు వస్తే.. ఇప్పుడు 16 స్థానానికి పడిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పోతూ పోతూ బీజేపీని గెలపించారన్నారు. కేసీఆర్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించారని దుయ్యబట్టారు.









