రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆదివారం చాలా ప్రాంతాల్లో వర్షం పడడంతో ఎండ వేడిమికి అల్లాడిపోయిన జనం చల్లటి వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూపాలపల్లి నియోజకవర్గమంతా తుపాను బీభత్సానికి జనం ఉలిక్కిపడ్డారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల్లో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామాంతపూర్, బోడుపాల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, చింతల్, సూరారం, బోయినగర్, బోయిన్‌పల్లి డ్రైనేజీలు పలుచోట్ల పొంగిపొర్లాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత పలు జిల్లాల్లో భారీ వర్షం ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని, 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది.









