పీకల్లోతు కష్టాల్లో డొనాల్డ్ ట్రంప్
జూలై 11న శిక్ష ఖరారు చేయనున్న అమెరికా కోర్టు
అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఉత్కంఠ
(అమ్మన్యూస్, వాషింగ్టన్):
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ కు గత ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఓ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం మెడకు చుట్టుకుంది. శృంగార తార స్టార్మీ డేనియల్స్ తో బంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ అక్రమంగా నిధులు చెల్లించిన వ్యవహారంలో ఆయనపై నమోదైన 34 అభియోగాలు రుజువయ్యాయి. దీనిపై అమెరికా కోర్టు జూలై 11న శిక్ష ఖరారు చేయనుంది.
అక్రమ సంబంధం బయటపడకుండా..
అమెరికాలో శంగార తార స్టార్మీ డేనియల్స్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ కు 2016 ఎన్నికల సమయంలో ఇదో సమస్యగా మారే ప్రమాదం తలెత్తింది. దీంతో ఆయన స్టార్మీ వ్యవహారంపై నోరు విప్పకుండా ఆమెకు భారీ ఎత్తున డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సొంత నిధుల నుంచి కాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన విరాళాల నుంచి ఇచ్చారు. దీన్ని కప్పిపుచ్చేందుకు బిజినెస్ రికార్డుల్ని ఆయన తారుమారు చేశారు. దీనిపై 34 అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అవన్నీ ఇప్పుడు రుజువయ్యాయి.
దోషిగా తీర్పు..
ఈ కేసు విచారణలో భాగంగా స్టార్మీ డేనియల్స్ స్వయంగా కోర్టుకు హాజరై డొనాల్డ్ ట్రంప్ తో తన బంధం నిజమేనని చెప్పేసింది. దీంతో ఆయన నుంచి తనకు అందిన డబ్బుల విషయం కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పై అభియోగాల్ని ఖరారు చేస్తూ ఆయన్ను దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఓ వ్యక్తి దోషిగా నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. అయితే బిజినెస్ రికార్డులు మార్చడం అన్నది అమెరికాలో తీవ్రమైన నేరం కాకపోవడంతో దీన్ని జరిమానాతో కూడా సరిపెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న కోర్టు ఇచ్చే తీర్పు ఆయన అధ్యక్ష ఎన్నికల పోటీకి కీలకంగా మారబోతోంది. తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు.
చట్టానికి అందరూ సమానులే..
ఇదిలా ఉంటే.. బైడెన్–హారిస్ ప్రచార బృందం ఈ తీర్పును స్వాగతించింది. ఎవరూ చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి నిరూపితమైందని పేర్కొంది. చట్టాలేమీ వర్తించవనే ధోరణిలో ట్రంప్ వ్యవహరించేవారని ఆరోపించింది.
అప్పీలుకు అవకాశాలు..
తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు ప్రారంభించింది.
నేను అమాయకుణ్ని..
ఇది అవమానకరమంటూ తీర్పును ట్రంప్ కొట్టిపారేశారు. ఇది అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపించారు. నిజమైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని వ్యాఖ్యానించారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.