AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ వెన్నెముక ఇరిగిందని ముందే చెప్పా.. ఢిల్లీలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిస్తా
రాష్ట్రంలో పారదర్శకంగా పాలన
కీరవాణి రాగం.. అందెశ్రీ ఇష్టం

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన ఉన్న ఆయన మంగళవారం మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని, అందె శ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తనపని కాదన్నారు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీ దేనని, తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్‌ వ్యక్తికి ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగిందని తాను ముందే చెప్పానని, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచిందని, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్‌ బిల్లు కట్టమని చెప్పారు. ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్‌ ట్యాపింగ్‌పై సమీక్ష జరపలేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం అధికారులు చూసుకుంటున్నారని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు.

ఫామ్‌ హౌస్‌లో హార్డ్‌ డిస్కులు..
హార్డ్‌ డిస్కులను ధ్వంసం చేశారని, అన్నింటిపై సీబీఐ విచారణ అడిగే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావులు ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. తాను ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం లేదని, అలాంటి పనులు చేయనని స్పష్టం చేశారు. బ్యాకప్‌ డేటాకు సంబంధించిన హార్డ్‌ డిస్కులు ఫామ్‌ హౌస్‌లో ఉన్నాయో.. ఇంకా ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలని ముఖ్యమంత్రి అన్నారు.

విద్యుత్‌ కోతల్లేవ్‌..
రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య, కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవంతరాలు ఉన్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్సఫర్‌ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్సఫర్‌లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదన్నారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం పంపించారు.

ANN TOP 10