– ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశారు
– ఎమర్జెన్సీకంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్
– సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంగళవారం ట్విట్టర్ వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారని ఆరోపించారు. ఎమర్జెన్సీకంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని చెప్పారు. రాష్ట్రానికి సీఎంగా ఉండి కేసీఆర్ చేసిన పనులు ప్రజాస్వామ్యానికే అవమానమని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ పరిస్థితుల ఉన్నప్పటి కంటే దారుణంగా చేశారని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు. బీజేపీ నేతలు, తమ అనుచరులను తట్టిలేపడంతో కేసీఆర్ కు బీజేపీపై ఉన్న భయం ఇప్పుడు బట్టబయలైందని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో రాధా కృష్ణారావు ఇచ్చిన స్టేట్మెంట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయని అన్నారు.
కూతురును కాపాడుకునేందుకే..
లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న తన కూతురుని కాపాడుకునేందుకు కేసీఆర్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసును క్విడ్ ప్రోకోగా రూపొందించాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమవుతోందని తెలిపారు. కేసీఆర్ అండ్ గ్యాంగ్.. దంపతుల మధ్య వ్యక్తిగత సంభాషణలను కూడా వదిలి పెట్టకపోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. కేసీఆర్ చట్టానికి ద్రోహం చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాల రాశారని మండిపడ్డారు. నిజానికి, ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగబద్ధమైన ఏ పదవికి ఆయన అనర్హుడని, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.









