బిగ్ టాస్క్ అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి
గీత రచయిత అందెశ్రీతో కలిసి భేటీ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గీత రచయిత అందెశ్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్.. తదితరులు ఆయనతో పాటు రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటైంది. అందెశ్రీ రాసిన గీతం ఇది. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా అందెశ్రీ రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాదిమంది నోట్లో నానిందీ పాట. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలు, తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జీవో ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. కీరవాణి బ్రాండ్ కనిపించేలా, నాటు నాటు పాటకు మించిన స్థాయిలో ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ ఉండబోతోంది.









