(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. నిన్న రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసరమైన అంశలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. నిన్న ఈసీ నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈసీ షరతులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంట ప్రణాళిక, రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్పవ కార్యక్రమాలు వంటి వాటిపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేసి తీరుతామని పదే పదే చెబుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కేబినెట్‌లో ఇదే కీలకాంశం అయ్యేది. కానీ సీఈసీ షరతులతో చర్చకు అవకాశం లేదు.









