ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 75 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక అందరి దృష్టీ జూన్ 4వ తేదీపై నిలిచింది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఉత్కంఠభరితంగా మారింది. ఎవరికి వారే- తామే అధికారంలోకి వస్తామంటూ లెక్కలు వేసుకుంటోన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి.. నాయకులు లోక్‌సభ నియోజకవర్గాలవారీగా తాము సాధించే మెజారిటీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్.. నేడు ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించబోతోండటం చర్చనీయాంశమైంది. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉందీ ఐప్యాక్ ఆఫీస్. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. 20 నిమిషాల పాటు ఐప్యాక్ టీమ్‌తో భేటీ అవుతారు. 2019 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఐప్యాక్ ఆఫీస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అప్పుడు, ఇప్పుడూ వైఎస్ఆర్సీపీ కోసం పని చేసింది ఐప్యాక్. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన సంస్థ ఇది. రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందేల్.. డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
ఈ ఎన్నికల్లో తాము గెలవబోతోన్నామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన దీనికి సంబంధించిన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. మండుటెండలు సైతం లెక్కచేయకుండా ఓటర్లు సునామీలా తరలివచ్చారని గుర్తు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అయిదు సంవత్సరాల పాటు కొనసాగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందంటూ జగన్ హమీ ఇచ్చారు.