AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెంకీ మామ పొలిటికల్ ఎంట్రీ నేడే.. ఖమ్మంలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి పూర్తిగా సమీకరణాలు మారిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలంతా వరుసగా కారు దిగుతూ హస్తంతో దోస్తీ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. లోక్ సభ ఎన్నికలు రావటంతో ఈసారి వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుని పార్టీని మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నారు హస్తం నేతలు. ఈ నేపథ్యంలోనే.. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రఘురామి రెడ్డి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఆయన హీరో విక్టరీ వెంకటేష్‌కు స్వయనా వియ్యంకుడు. వెంకటేష్ కుమార్తె ఆశ్రితను రఘురామి రెడ్డి పెద్ద కుమారునికిచ్చి పెళ్లి చేశారు. ఇప్పటికే ఆశ్రిత కూడా రంగంలోకి దిగి.. తన మామయ్య తరపున జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో.. వియ్యంకుడి కోసం వెంకటేష్ కూడా రంగంలోకి దిగుతారని ముందు నుంచి ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు మరో ముందడుగేసి ఏకంగా వెంకీ మామ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు.. అది కూడా వియ్యంకుడి పార్టీ కాంగ్రెస్‌లోకే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. నేడే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి తరఫున రోడ్ షోలో సందడి చేయనున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ ఆయిన విక్టరీ వెంకటేష్.. అద్భుతమైన నటనతో, సున్నితమైన హస్యంతో.. ప్రత్యేకంగా కుటుంబ ప్రేక్షకుల అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మంచి మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌‌లు చేస్తూ యంగ్ హీరోలకు కూడా పోటీనిస్తూ.. దూసుకుపోతున్నారు. సీనియర్‌ హీరోగా జూనియర్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ దూసుకుపోతున్న వెంకటేష్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు.. నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

అయితే.. వెంకటేష్ మాత్రం ముందు నుంచి ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. తన వియ్యంకుడి తరపున ప్రచారం నిర్వహించబోతున్నారన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే.. ఈ వార్తల్లో నిజమేంతా.. అబద్ధమెంతా అన్నది రేపటివరకు వేచిచూడాల్సిందే. నిజంగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా.. లేదా కేవలం తన వియ్యంకుడి తరపున రోడ్ షో చేసి సినీ గ్లామర్ అద్దుతారా అన్నది చూడాలి.

ANN TOP 10