AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ – కేసీఆర్ తోడు దొంగలు.. ఆదిలాబాద్‌ గడ్డపై రేవంత్‌ ఫైర్‌

మాటిస్తున్నా.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తా
ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలే
త్వరలోనే రుణమాఫీ చేసి తీరుతాం
నాగోబా జాతరకు రూ. 4 కోట్లు కేటాయిస్తాం
సీఎం రేవంత్ వరాల జల్లు

అమ్మన్యూస్, ఆదిలాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మొదలైందన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని, త్వరలోనే రైతులకు రుణమాఫీ కూడా చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రాంజీ గోండు, కొమురం భీం పోరాటాలను మరువమని సీఎం గుర్తు చేశారు. ధాన్యం కుప్పల మీద రైతుల గుండెల ఆగిన రోజుల నుంచి.. పండించిన ప్రతి గింజను కొనే రోజులచ్చాయన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

బోథ్ ప్రాంతంలో కుఫ్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని మాటిచ్చారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజి నిర్మిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామని, ప్రాణహిత బ్యారేజి నిర్మాణం పూర్తి చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించారు. జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూతపడ్డ సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తామ న్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తామని అన్నారు.

మోదీ, కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యాన్ని ఎందుకు కూలగొట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనను జీర్ణించుకోలేక ఢిల్లీలో ఉండే మోదీ – గల్లీలో ఉన్న కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రమాదంలో పడితే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచి పోతాయని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీజేపీ – బీఆర్ఎస్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100రోజుల్లోనే అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. హామీలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌ను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓర్వడం లేదని నిలదీశారు. ఆ రెండు పార్టీల్లో ఏ అభ్యర్థికి ఓటు వేసిన వారంతా ఒక్కటేనని ఆరోపించారు. వారు గెలిచిన ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు వరాల జల్లు కురిపించారు. నాగోబా జాతరకు రూ. 4 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని, కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చామని, పనులు చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలు ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. మాటిస్తున్నా.. ముక్తి ప్రాజెక్టును కట్టి.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి అంబేద్కర్ పేరు పెడుతామన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. అక్కడి ముంపు ప్రాంతాలపై ఆ ప్రభుత్వంను ఒప్పిస్తామని, ఆదిలాబాద్‌లో యూనివర్శిటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ, కేడీ కలిసి ఆదిలాబాద్‌ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మోడీ, కేడీ కలిసి సిమెంట్ కర్మాగారం అలానే ఉంచారని, ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి అయినా సరే ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు.

ANN TOP 10