బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి విఫలమైందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ సంస్థాపన దినోత్సవం సందర్బంగా.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామని, అది చేశామని గుర్తు చేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం చేయాలని అద్వానీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీర్మానం చేశామన్నారు. ట్రిబుల్ తలాక్ రద్దు చేసామన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కోసం మోడీ సర్కార్ పని చేస్తుందన్నారు. దేశం విశ్వ గురువు కావాలన్నారు. ప్రధాని విశ్వ నేతగా మార్గనిర్దేశనం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటి నినాదం ఈసారి 400 సీట్లు మరోసారి ప్రధాని మోడీ కావాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పతనం స్టార్ట్ అయ్యింది..
సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది తప్ప ఇచ్చిన గ్యారంటీల అమలు మీద లేదన్నారు. కాంగ్రెస్ ఇక పెరిగే అవకాశం లేదన్నారన్నారు. ఓ రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ లను వంద రోజుల్లో అమలు చేస్తానని అన్నావు కదా? ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండేది బీజేపీనే అన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు కలిసి బీజేపీని ఏమీ చేయలేరన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం బీజేపీ తోనే సాధ్యమన్నారు. బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతున్నా అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం మెనిఫెస్టోలు విడుదల చేయడం కాదని, ముందు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు హస్తం పార్టీకి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.









