AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేస‌విలో క‌రెంట్, తాగునీటి సమ‌స్య ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు(Power) డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్తు లభ్యత, తక్షణ అవసరాలపై ఆదేశాలిచ్చారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ను అభినందించారు. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు.

తాగునీటి కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి (Drinking water) కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్ వెల్స్ (Borewells), బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు (District Collectors) ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు.

ANN TOP 10