AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నోటా ఉన్నప్పుడు ఏకగ్రీవం ఎలా సాధ్యం..? ఏపీ హైకోర్టు సంచలన ప్రశ్న..!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాల వ్యవహారం ఇప్పుడు మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఒక గ్రామంలో సర్పంచ్ పదవికి ఒక్కరే నామినేషన్ వేస్తే.. వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీ. అయితే, ఈ ప్రక్రియ చట్టబద్ధతపై ఏపీ హైకోర్టులో తాజాగా ఆసక్తికరమైన చర్చ జరిగింది.

పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలను సవాలు చేస్తూ జడ శ్రవణ్ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేశారు. బ్యాలెట్ పేపర్‌పై నోటా (NOTA) ఆప్షన్ ఉన్నప్పుడు, ఏ ఎన్నికను కూడా ఏకగ్రీవంగా ప్రకటించడానికి చట్టం అనుమతించదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థి ఒక్కరే ఉన్నా, ఆ అభ్యర్థి ఇష్టం లేని ఓటర్లకు నోటాకు ఓటేసే హక్కు ఉంటుందని ఆయన వాదించారు. కాబట్టి, ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అధికారికంగా బ్యాలెట్ పేపర్ల మీద నోటా ఆప్షన్ ఉంది కదా?’ అని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ లేవనెత్తిన ఈ సాంకేతిక, చట్టపరమైన అంశాలపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలాంటి వివరణ ఇస్తాయో, దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఏకగ్రీవ సర్పంచ్‌లలో ఉత్కంఠ నెలకొంది.

ANN TOP 10