కేసీఆర్ ఛలో నల్గొండ సభలో కాంగ్రెస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీనిపై కాళేశ్వరం పర్యటనలో ఉన్న మంత్రులు ఒక్కోకరుగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ సభలో కేసీఆర్ మాట్లడిన మాటలకి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తూ.. కాళేశ్వరం పర్యటనకు సంబందించిన ఫోటోలను షేర్ చేశారు. కాంగ్రెస్ నాయకుల మేడిగడ్డ పర్యటనపై కేసీఆర్ మాట్లాడుతూ..
” మేడిగడ్డకు ఎందుకు పోయారు..? ఏముంది అక్కడ బొందల గడ్డనా..? అని ఆక్రోశం వెళ్లగక్కుతున్నడని, నిజమే.. కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవ్వాళ బొందలగడ్డగా మారింది. తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణను పచ్చగ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి, కాంగ్రెస్ ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత- చేవేళ్ల డిజైన్లు మార్చి.. కాళేశ్వరం పేరుతో కమీషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఇవ్వాళ మేడిగడ్డ రూపంలో కళ్లముందు కనిపిస్తోంది. కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు నాలుగు కోట్ల ప్రజల ఆశలు. ఈ నేరానికి శిక్ష తప్పదు. ఈ ఘోరం కళ్లారా చూసి.. తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నమే.. సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఇవ్వాల్టి మేడిగడ్డ పర్యటన”. అంటూ రాసుకొచ్చారు.









