కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మంగళవారం నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలో రెచ్చిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ అని అన్నారు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదనో పక్షిలా తీరుక్కుంటూ రాష్ట్ర మొత్తానికి చెబుతూనే ఉన్నానని పేర్కొన్నారు. నీరు లేకపోతే తెలంగాణ లేదని, నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పరిష్కరించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేన్నారు. మనం ఉద్యమించకపోతే మనల్ని రక్షించేందుకు ఎవరూ రారని తెలిపారు. నల్గొండ సభ తెలంగాణ వ్యతిరేకులకు ఓ హెచ్చరిక అంటూ మండిపడ్డారు. నిమిషం కూడా కరెంట్ పోకుండా మనం సప్లయ్ చేశామని చెప్పారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును ప్రజలు తెచ్చుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
‘ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అని ఇప్పటి పాలకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రమే బాగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది. శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టేకాలే వరకు పులిలా కొట్లాడుతా. పిల్లిలాగా సైలెంట్‌గా ఉండను. అవసరమైతే పిడికిలి బిగించాలి. కేసీఆర్ సర్కారు పోగానే కరెంటు ఎటు పోయింది. చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. అదనపు కరెంట్ ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడం లేదు. మీకు తెలివిలేక, నడపరాక, చేతకాక కరెంట్ పోతోంది. 3 కోట్ల టన్నుల వడ్డు పండించిన తెలంగాణకు ఏం బీమారి వచ్చింది. రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయ. కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా’ అంటూ ప్రశ్నించారు.
‘కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులను ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు. మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట. మేడిగడ్డ పోయి ఏం పీకుతారు. దమ్ముంటే నీళ్లు ఎత్తి పోయాలి. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలి. నాగార్జున సాగర్‌కుంగలేదా? కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా? అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా తేలేవరకూ కొట్లాడాలి. నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు..హక్కుల మీద పోరాటానికి సిద్ధంగా లేకపోతే నష్టపోతాం. కరెంట్ ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా. రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు.. ఫోన్లు మోగడం లేదు. అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదు. మీరేం బాధపడకండి, మళ్ళీ మనమే వస్తాం. కృష్ణా, గోదావరి జలాల్లో సంపూర్ణమైన వాటా వచ్చే వరకూ పోరాడుతా అంటూ’ కేసీఆర్ చెప్పుకొచ్చారు.









