AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఢిల్లీ ఛలో’.. రాజధానిలో టెన్షన్.. టెన్షన్

రైతన్నలు మరోసారి ‘ఢిల్లీ ఛలో’ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో దేశ రాజధానిలో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్ల‌న్నీ వాహ‌నాల‌తో నిండిపోయాయి. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు నేడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో ఢిల్లీని క‌లిపే కీల‌క పాయింట్ల వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జామైంది. ఘాజిపూర్‌, చిల్లా బోర్డ‌ర్ల వ‌ద్ద కార్లు బారులు తీరాయి. ఘ‌జియాబాద్‌, నోయిడా మార్గం కిక్కిరిసిపోయింది. ఢిల్లీ, గురుగ్రామ్ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెహిక‌ల్ చెకింగ్ పాయింట్ల వ‌ద్ద ర‌ద్దీ పెరిగింది. అలాగే పంజాబ్, హర్యానా శంభూ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే సమయంలో రైతులను సరిహద్దుల్లో అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే తమ సమస్యల పరిష్కారానికి రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో.. ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ రహదారులన్నిటినీ మూసివేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. పార్లమెంట్‌ సమీపంలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.

దేశ రాజధానిలోకి రైతులు అడుగుపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ట్రాక్ట‌ర్ల ర్యాలీని అడ్డుకునేందుకు భారీ బ్యారీకేడ్ల‌ను పెట్టారు. కాంక్రీట్ బ్లాకుల‌ను ఏర్పాటు చేశారు. ఇనుపు వైర్లు, మేకుల‌ను కూడా అమ‌ర్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై రూపొందించిన చట్టాన్ని నిరసిస్తూ రైతులు 2020లో పెద్దయెత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని వారు పట్టుపడుతున్నారు. అలాగే అనేక ఇతర డిమాండ్ల పరిష్కారాన్ని కూడా కోరుతూ వారు తాజాగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

ANN TOP 10