గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు మరోసారి షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదలు అనేక మంది బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు మర్యాదక పూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. అయితే కొంత కాలంగా బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న శ్రీలత శోభన్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రానప్పటికీ భవిష్యత్తులో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మొదలు అనేక మంది ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కేవలం తమ నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. పార్టీ మారే ఉద్దేశం లేదని తెలిపారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా సీఏం రేవంత్ రెడ్డిని కలిశారు. నగరంలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు తెలిపారు.
ఆ తరువాత కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాజీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. సికింద్రాబాద్ లేదా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి మొదలైంది. ఆయన కలిసిన వారం వ్యవధిలో డిప్యూటీ మేయర్ దంపతులు రేవంత్‌ను కలవడంతో ఇంకెంతమంది పార్టీని వీడతారన్న సందేహం చాలా మందిలో తలెత్తింది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది.









