ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నారు. మంగళవారం ప్రారంభమైన సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తిర్మాణంపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని టీడీపీ సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యులకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరుగుతుంది.









