AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్‌ కుమార్‌, బల్మూరి వెంకట్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్ లు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీలుగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న సస్పెన్స్ చివరి వరకు కొనసాగింది. చివరకు బుధవారం సాయంత్రం ఇద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించడంతో సస్పెన్స్ కు తెరపడింది. పార్టీ నేతలు, ముఖ్యులు, మంత్రులు తదితరులతో అట్టహాసంగా తరలి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులిద్దరూ గురువారం శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు తమ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారి సన్నిహితులు భారీగా తరలి రావడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ తీవ్ర రద్దీగా మారాయి.

నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ కోసం అనునిత్యం కష్టపడ్డ వారికే చివరకు పార్టీ గుర్తించిందని, అందుకే మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లకు పార్టీ ఎమ్మెల్సీలుగా ఖరారు చేసిందని కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు, గడచిన 10 సంవత్సరాలుగా అధికార పార్టీ దాష్టికాలకు బలైంది ఎవరన్న విషయాన్ని పార్టీ గుర్తించిందని శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఇన్నాళ్ళూ బానిస బతుకులు బతికిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు దాస్యశృంఖలాల నుంచి విముక్తులయ్యామన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని మంచి రోజులు రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

కష్టే ఫలే – మంత్రి ఉత్తమ్

పని చేసే కార్యకర్త ఎవరైనా పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ల కష్టానికి తగిన ఫలితాన్ని అధిష్టానం అందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎవరికి ఎప్పుడు ఏ పదవిని అప్పగించాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్పష్టతతో ఉందన్నారు. 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని, అలాంటి కార్యకర్తలందరికీ ఇప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించాలన్న విషయంలో అధిష్టానం కొంత కసరత్తు చేసిందని, ఈ కసరత్తు ప్రక్రియలో కొన్ని పేర్లు ప్రస్తావనకు రావడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఎవరికి ప్రాధాన్యమివ్వాలి, రాబోయే కాలంలో ఎవరిని గుర్తించాలన్న విషయంపై పూర్తి స్పష్టత అనంతరం ఇద్దరి పేర్లను ప్రకటించిందన్నారు.

ANN TOP 10