AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనాకు భారత్ చెక్‌.. అర్జెంటీనాతో కీలక ఒప్పందంపై సంతకం

వాణిజ్యం, ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా గుత్తాధిపత్యం సాధించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆ దేశం చేసే ఎగుమతులపై ఆధారపడిన దేశాలను.. తన కంట్రోల్‌లో ఉంచుకుని.. తన అవసరాలకు వాడుకోవాలని చైనా చూస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే భారత్‌పైనా ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకిన్ ఇండియా నినాదంతో చైనా ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించిన భారత్.. సొంతంగానో లేక చైనా కాకుండా వేరే దేశాలతో వివిధ రకాల ఒప్పందాలను చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా అర్జెంటీనాతో కీలకమైన లిథియం డీల్‌ కుదుర్చుకుంది. దీంతో ఇప్పటివరకు లిథియం దిగుమతుల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్న భారత్.. ఈ ఒప్పందం కారణంగా అది తగ్గుతుందని యోచిస్తోంది.

అర్జెంటీనాతో లిథియం మైనింగ్‌కు సంబంధించి సోమవారం (జనవరి 15) ఒక ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీల్ ప్రకారం అర్జెంటీనాలోని కాటమార్కా ప్రాంతంలో ఉన్న ఐదు బ్లాకుల్లో లిథియం నిక్షేపాలను భారత్ మైనింగ్ చేయనుంది. దేశ అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్‌ వెంచర్‌ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్).. అర్జెంటీనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేమ్యాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో లిథియం మైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కాబిల్ సంస్థ నాల్కో, హిందుస్థాన్‌ కాపర్‌, ఎంఈసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. అర్జెంటీనాలోని కాటమార్కా ప్రావిన్స్‌లో ఉన్న ఈ లిథియం నిక్షేపాలు దాదాపు 15703 హెక్టార్లు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు బ్లాకుల్లో లిథియాన్ని వెలికితీయడం కోసం అక్కడి అవసరాలను తీర్చేలా అక్కడ ఒక బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది.

ANN TOP 10