AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవారి భక్తులకు గమనిక: మారిన టీటీడీ వెబ్‌సైట్​.. కొత్త పేరు ఇదే

తిరుప‌తి సహా ఇత‌ర ప్రాంతాల్లోని టీటీడీ స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించే దిశ‌గా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆలయాలకు సంబంధించిన అన్ని వివ‌రాల‌తో ఆధునీకరించిన వెబ్‌సైట్‌‌ ttdevasthanams.ap.gov.inను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించిన స్థ‌ల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను ఇందులో పొందుపరిచారు.

ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ ను ఆధునీకరించింది. ఇప్పటి వరకూ టీటీడీ వెబ్‌సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండగా.. తాజాగా ttdevasthanams.ap.gov.inగా మారింది. ఈ మేరకు వెబ్‌సైట్ పేరును భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్’‌లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ ఇప్పుడు ttdevasthanams.ap.gov.inగా మార్పుచేసినట్టు తెలిపింది.

శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా ఉద్దేశంతో వెబ్‌సైట్‌ను మార్చినట్టు పేర్కొంది. ఇక నుంచి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. అంతేకాదు, మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, అధికారిక వెబ్‌సైట్ నుంచి సేవలు, దర్శనాలు టిక్కెట్ పొందాలని తెలిపింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డి, జేఈవోలుసదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, డిఎల్వో వీర్రాజు, సీఈ నాగేశ్వరరావు, ఐటీ జరల్ మేనేజర్ శ్రీ ఎల్ ఎం. సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10