ఉత్తరప్రదేశ్ (UP) అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టమని అన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘హనుమాన్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినట్లు చెప్పారు. జనవరి 22వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఉత్సవానికి హాజరు కాబోతున్నట్లు వెల్లడించారు.
యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 22వ తేదీ మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పదుకొణె సహా పలువురు స్టార్స్‌కు ఆహ్వానాలు అందాయి. ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి సుమారు 7వేల మంది హాజరవుతారని అంచనా.









