AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కమనీయం.. మల్లన్న కల్యాణం

ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా, వీరశైవపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ కొమురవెల్లి మల్లికార్జునస్వామి కేతలమ్మ, మేడలాదేవీలను వివాహమాడాడు. సనాతన వీరశైవాగమశాస్త్రం ప్రకారం మార్గశిర మాసం చివరి ఆదివారం రోజును పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని తోటబావి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కల్యాణవేదికపై ఈవో బాలాజీశర్మ ఆధ్వర్వంలో నభూతో నభవిష్యత్తు అన్న చందంగా కమనీయంగా, రమణీయంగా కైంకర్యం నిర్వహించారు.

వీరశైవార్చకులు మల్లికార్జునస్వామి, కేతమ్మ, మేడలాదేవీల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ మహిళల కోలాటాల నడుమ భాజాభజంత్రీల మధ్య కల్యాణ మంటపానికి తీసుకొచ్చారు. వరుడు మల్లికార్జునస్వామి తరఫున కన్యాగ్రహితలుగా పడిగన్నగారి మల్లికార్జున్‌ దంపతులు, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, మేడలాదేవీల తరఫున కన్యాదాతలుగా మహదేవుని మనోహర్‌ దంపతులు వ్యవహరించారు. వీరశైవ ఆగమపండితులు గణపతిపూజ, స్వస్తివాచనం, మంటప దేవతారాధన ప్రతిష్ట, పాదార్చన, భాషింగ ధారణ, వస్ర్తాలంకరణ, మధుసంపర్క స్వీకరణ, గూడజీరశిఖారాధన, కన్యాదానం, మంగళసూత్రధారణ జరిపారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు, ఒడిబియ్యం పోశారు. ప్రత్యేక పూల అలంకరణ వేదికపై పట్టువస్ర్తాలతో ధగధగలాడుతున్న దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి కల్యాణ నిర్వహణ తీరు, విశేషాలను డాక్టర్‌ మహంతయ్య, షశిభూషణ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యానం భక్తులను అలరించింది. ‘‘మల్లన్నకీ జై…’’ అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. దేవదేవుల నామస్మరణలో పులకించిపోయారు.

పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించిన మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తలంబ్రాలను అందజేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీసీ, రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె వాటిని కల్యాణమండపానికి తీసుకొచ్చారు. మాంగళ్యధారణ అనంతరం స్వామివారిని దర్శించుకుని మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి కొండా సురేఖ కుటుంబసభ్యులతో కలిసి పట్నంవేసి మొక్కు తీర్చుకున్నారు. అంతకుముందు యాదవపూజారులతో పాటు గ్రామసర్పంచ్‌ సార్ల లత, ఉపసర్పంచ్‌ కొండాశ్రీధర్‌ దంపతులు సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు.

ANN TOP 10