ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు (మంగళవారం) నుంచి తిరిగి ప్రారంభమైంది. ఆదివారం, న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్ పడింది. తిరిగి ఈరోజు నుంచి యధావిధిగా ప్రజాపాలన-అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. జీహెచ్‌ఎంసీలో 650 కేంద్రాల్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ యథాతథంగా సాగుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. గత డిసెంబర్ 28న కార్యక్రమం ప్రారంభం అవగా.. ఈనెల 6 వరకు కొనసాగనుంది.
అయితే డిసెంబర్ 28 నుంచి 30వ వరకు ఈ కార్యక్రమం కొనసాగగా.. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ 30 వరకు అంటే మూడు రోజుల్లో 9.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్, మహాలక్ష్మి పథకంలో నెలకు రూ.2500, రాయితీపై రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల కోసం నగరవాసులు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రేటర్‌లో కోటికిపైగా జనాభా ఉండగా.. 24 నుంచి 25 లక్షల వరకు కుటుంబాలు ఉంటాయని అంచనా. వీరిలో 11.10 లక్షల మందికి ఇప్పటికే దరఖాస్తులు పంపిణీ చేశారు. ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగనుంది.









