మెట్రో కానీ, ఫార్మాసిటీని కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మియాపూర్ నుంచి ఆర్సీపురం వరకూ మెట్రోను విస్తరించడంతోపాటు.. గతంలో ప్రతిపాదించినట్లుగా రాయదుర్గం నుంచి కాకుండా పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి మెట్రోను తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని, ఎయిర్పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది.. ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామంటూ రేవంత్ పేర్కొన్నారు.
అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టుకి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుందన్నారు. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయన్నారు.
గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన. ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని.. స్కిల్స్ అదనంగా ఉంటాయని వివరించారు. అక్కడ నుంచి బయటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందన్నారు.









