తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకరానికి మధ్యాహ్నం 1.04 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది.
ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మూడు వేదికల ఏర్పాటు చేయగా.. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎడమవైపున63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక, కుడిపక్కన వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
⍟ తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరనుండగా.. మంత్రివర్గంలో చేరేవారికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్ ఠాక్రే ఫోన్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను నియమించనున్నారు. మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, దుద్ధిళ్ల శ్రీధర్ బాబులకు చోటు కల్పించినట్టు తెలుస్తోంది.
⍟ ఢిల్లీ నుంచి కొద్దిసేపటి కిందట బయలుదేరిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
⍟ ప్రస్తుతం శంషాబాద్‌లోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఉదయం 11 గంటలకు అక్కడ నుంచి బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్తారు.
⍟ తన ప్రమాణస్వీకారానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
⍟ రేవంత్ క్యాబినెట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా 12 మందికి అవకాశం కల్పించారు. వీరికి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
⍟ మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహలకు చోటు దక్కింది. రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేవారి జాబితా రాజ్‌భవన్‌కు చేరింది. గెలిచిన సీనియర్లకు దాదాపు క్యాబినెట్‌లో చోటుకల్పించారు.









