ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరన్న కంది శ్రీనివాసరెడ్డి
బేల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత పర్యటన
అపూర్వ స్వాగతాలు, మంగళహారతులు పట్టిన మహిళలు
కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేఎస్ఆర్ ముమ్మరంగా ప్రచారం
ఆదిలాబాద్ః కల్లబొల్లి మాటలు..అబద్దపు హామీలు ఇకచాలని, ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వస్తోందని, ఆ తుఫాన్‌లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మురంచేసింది. అందులో భాగంగానే బేల మండలంలోని సాంగిడి, కొత్తసాంగిడి, కాంగార్‌పూర్, బెదోడగూడ, మణియార్‌పూర్, దహెగావ్, మోహబత్‌పూర్, శంషాబాద్, కాప్సీ, డొప్టాల, టాక్లీ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆరు గ్యారంటీ హామీల కరపత్రాలు పంచుతూ ప్రచారంలో దూసుకెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. గ్రామగ్రామాన బాణాసంచా కాల్చి డప్పుచప్పుళ్ల మధ్య పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. నుదుటన తిలకందిద్ది మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. చేతిలో జెండాలు పట్టుకుని జై కాంగ్రెస్..జై కంది శ్రీనన్న నినాదాలతో హోరెత్తించారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో పల్లెల్లో ఎన్నికల పండుగ వాతావరణం కొట్టిచ్చినట్టు కన్పించింది. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు ప్రజలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరగా వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన తనను మనస్ఫూర్తిగా దీవించాలని కోరారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి సాంగిడి గ్రామానికి జోగు రామన్న చేసిందేమీ లేదన్నారు. చేతి గుర్తంటనే దళితులు, బడుగు, బలహీనవర్గాలు, పేదల పార్టీ అన్నారు. పొరపాటున కూడా ఈసారి కారు, కమలం గుర్తుకు ఓటేయకండని, ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను, పేదలను వంచించిన పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. రుణమాఫీ, ఉద్యోగాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు.మన బతుకులు కాంగ్రెస్‌తోనే బాగుపడ్తాయన్న నమ్మకం ప్రజలకుందన్నారు.పేదింట్లో పుట్టిన తనకు పేదల కష్టాలు తెలుసన్నారు. ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఓట్ల ద్వారా ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఏకైక సంకల్పంతోనే అమెరికా నుండి ఆదిలాబాద్‌కు వచ్చానని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి పర్చి మంచిపేరు సంపాదించటానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తను ఒక్కడిని ఎదుర్కొనేందుకు జోగు రామన్న, పాయల శంకర్, సంజీవరెడ్డి, సుజాత, సాజిద్ ఖాన్‌లు ఒక్కటయ్యారన్నారు. అందరూ కాంగ్రెస్‌కు ఓటువేసి జోగు రామన్న రాక్షస పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కనిపిస్తున్న సాత్నాల ప్రాజెక్టు, రిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, మూతపడ్డ CCI, స్పిన్నింగ్ మిల్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనివేనని తెలిపారు. బీజేపీ ధర్మంపేరుతో చేస్తున్న రాజకీయాలను జనం గమనిస్తున్నారన్నారు. బీజేపీ అసలు పోటీలోనే లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు సాగుతుందని తెలిపారు. మరాఠాలను ఓబీసీలో కలపాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉందని, కానీ పార్లమెంట్‌లో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న బీజేపీ ఆ పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందుకోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బేల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









