– కేసీఆర్ చేసేదంతా గారడీ
– తెలంగాణలో తీరని విధ్వంసం
– అవినీతికి నిదర్శనం మేడిగడ్డే
– ప్రజలు తిరగబడటం ఖాయం
– వచ్చేది మా ప్రభుత్వమే
– కాంగ్రెస్‌కు 80 నుంచి 85 సీట్లు పక్కా
– అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం
– కేసీఆర్ అవినీతిపైనా విచారణకు ఆదేశిస్తాం
– ‘మీట్ ది ప్రెస్’లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
‘సీఎం కేసీఆర్ పాలనలో భూ దోపిడీ.. అంతులేని అవినీతి .. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం రైతుల నుంచి లాక్కున లక్షలాది ఎకరాలు.. నిర్మించిన మేడిగడ్డే.. రాష్ట్రంలో తీరని విధ్వంసం.. ప్రజలు కేసీఆర్ పాలనపై తిరగబడటం ఖాయం.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. 80 నుంచి 85 సీట్లు పక్కా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని, నిజాం నిరంకుశ పాలన… సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. అని అన్నారు.
తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి అని, తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని అన్నారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు.
తెలంగాణ వచ్చిన తరవాత సీఎం కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని, పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని, ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచామన్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలన్నారు. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదని.. తెలంగాణ ఆత్మగౌరవం కోసమని రేవంత్ స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, గతంలో కాంగ్రెస్‌లో ఎవరు సీఎంగా ప్రజా దర్బార్‌ను నిర్వహించారు… ప్రజలకు అందుబాటులో ఉన్నారు.. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని.. ఆయన రాచరికం అనుకుంటున్నారని.. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయన్నారు. రూ. 2వేల పెన్షన్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. ఆయన ఇచ్చే పెన్షన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందని, కేసీఆర్ సవాల్‌లో పస లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశిస్తామని అన్నారు.
60 నెలల్లో కేసీఆర్ పేదలకు రూ. లక్షా 80 వేలు బాకీ ఉన్నారని, 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమేనని రేవంత్ రెడ్డి అన్నారు. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారని, ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహమని దుయ్యబట్టారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు… ఇప్పటికీ అతీగతి లేదని ఎద్దేవా చేశారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన అని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు.. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తాం.. 24 గంటల కరెంటుపై ఏ సబ్ స్టేషన్ కైనా వెళ్దాం… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం’ మని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని, హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయన్నారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తోందన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.









