బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది. ఇది మరింత బలపడి వచ్చే 12 గంటల వ్యవధిలో తుపాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండంగా తుఫాన్‌గా మారడానికి అనువైన వాతావరణం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం (Cyclonic circulation) క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు వివరించింది. ఈ తుపాన్‌కు మిధిలీ (Midhili cyclone) అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ నేటి నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ వాయుగుండం మరింత బలపడుతుందని, తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ వివరించింది.
గురువారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 190, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 280, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది బంగ్లాదేశ్ వైపు కదులుతుందని, శనివారం తెల్లవారు జాము నాటికి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా- ఖేపుపారా మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఈ తుపాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది.









