AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షమి దెబ్బకు కివీస్‌ విలవిల.. ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్‌

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా పదో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో బుధవారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఏడు వికెట్లతో చెలరేగిన(7/57) మహమ్మద్ షమీ న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117), శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105) శతకాలతో రాణించారు. శుభ్‌మన్ గిల్(66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), రోహిత్ శర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 134) సెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్(73 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(13), రచిన్ రవీంద్రలను మహమ్మద్ షమీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దాంతో న్యూజిలాండ్ 39 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ ఆచితూచి ఆడారు.

డారిల్ మిచెల్ సెంచరీ..
85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్ మిచెల్.. భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ జోడీ సూపర్ బ్యాటింగ్‌తో మూమెంటమ్ మొత్తం న్యూజిలాండ్ వైపు మళ్లింది. రోహిత్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. బుమ్రా బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఇచ్చిన సునాయ క్యాచ్‌ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను రెచ్చిపోయాడు.

మలుపు తిప్పిన మహమ్మద్ షమీ..
181 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మహమ్మద్ షమీ విడదీసాడు. కేన్ విలియమ్సన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్‌ను కూడా బంతి వ్యవధిలో డకౌట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన గ్లేన్ ఫిలిప్స్‌తో డారిల్ మిచెల్ నిలకడగా ఆడాడు. కీలక భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బుమ్రా విడదీసాడు.

ANN TOP 10