దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నియామకానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి నియామకాలను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రక్రియకు సంబంధించి తీసుకువచ్చిన 2023 చట్టాన్ని సైతం ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. ముఖ్యంగా కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) తొలగించడాన్ని పిటిషనర్ తీవ్రంగా తప్పుబట్టారు.
మరోవైపు, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా ఒక్కటే తమ అంతిమ లక్ష్యం కాదని, ఆయన స్థానంలో మరొకరు వచ్చినా మార్పు ఉండదని, అందుకే ఆ వివాదాస్పద ప్రక్రియనే పూర్తిగా రద్దు చేయాలని నిరసనకారులు స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సీజేపీ, వివిధ విద్యార్థి సంఘాలు సుదీర్ఘ పోరాటాలకు పిలుపునిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది.









