రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటం, ఏకాదశిని పురస్కరించుకుని గురువారం రాజకీయ పార్టీల కీలక నేతలు, పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. వారం రోజులుగా అంతంత మాత్రంగా నామినేషన్లు దాఖలు కాగా..గురువారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయగా, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్ దాఖలు వేశారు.
సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జిహెచ్‌ఎంసి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి జిహెచ్‌ఎంజి కార్యాలయం వరకు వందలాది మందితో కలిసి తలసాని ర్యాలీ నిర్వహించారు. ఎల్‌బినగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జిహెచ్‌ఎంసి ఈస్ట్ జోన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో నామినేషన్ వేశారు. ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసం నుంచి భారీగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి ఆర్‌డిఒ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్‌లో బిఅర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మధిరలో భట్టి, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ నామినేషన్
కాంగ్రెస్ కీలక నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క నామినేషన్ వేయగా, బిఅర్‌ఎస్ అభ్యర్థిగా కమల్‌రాజ్ నామినేషన్ వేశారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థుల భారీ ఎత్తున నామినేషన్లు సమర్పించారు.
అంబులెన్స్ లో వెళ్లి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఇటీవల ఎన్నికల ప్రచారంలో దుబ్బాక కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ వేశారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో దుబ్బాకకు వెళ్లిన ఆయన.. వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









