ప్రాజెక్టుల పేరిట తెలంగాణ అప్పులమయం
కాళేశ్వరం కొట్టుకుపోయినట్టే కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయం
రాష్ట్రాన్ని బతికించుకోడానికే కాంగ్రెస్‌కు మద్దతు
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం
రాష్ట్రంలో తొమ్మిదేళ్ల నిరంకుశపాలన, అవినీతితో సంపదను కొల్లగొట్టిన సీఎం కేసీఆర్‌ను మరోసారి గెలిపిస్తే ప్రజలకు చిప్పేగతి అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఆన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి, ఋణ విముక్తి కమిషన్ మాజీ సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్, వీరన్న నాయక్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదండరాం మాట్లాడుతూ కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. రూ.లక్షల కోట్లు వెచ్చించి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి ఒక ఎకరాకు నీరు అందించలేదన్నారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు అందడం లేదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారనే సాగు నీరు అందుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులో నింపుకోవడానికే తప్ప ఏలాంటి ప్రయోజనం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.76 వేల కోట్లతో డిజైన్ వేయగా, రూ.1.87లక్షల కోట్లకు పెంచడంతో 141 శాతం ఖర్చు పెరిగిందన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఏడాది 100 టీఎంసీల నీటిని తోడాల్సి ఉండగా, 4 సంవత్సరాల్లో 100 టీఎంసీల నీటిని కూడా తోడలేదన్నారు. ఇప్పటికే కాళేశ్వరం పంపులు మునిగిపోయాయని, ఎల్లంపల్లి వద్ద గండిపడిందని, మధ్యమానేర్ సొరంగాలు లీక్ అవుతున్నాయని దీంతో మనకు నీళ్లు ఏలా వస్తాయని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో కేసీఆర్ చేరిపోయారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి లెక్కల ప్రకారం రూ.25వేల కోట్లు గల్లంతు అయ్యాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం కొట్టుకుపోయినట్టే కేసీఆర్ కొట్టుకుపోతాడని అన్నారు. ధరణి కేసీఆర్ కుటుంభానికి కుంకుమభరణిగా మారిందని, ప్రజల కుంకుమ భరణిగా మార్చాలన్నారు.









