AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జంపా మ్యాజిక్… వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ అవుట్

వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కథ మారలేదు. ఆ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ చేజేతులా ఓడింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 64 పరుగులు చేయగా, ఓపెనర్ డేవిడ్ మలాన్ 50, మొయిన్ అలీ 42 పరుగులు చేశారు.

ఓ దశలో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తున్నట్టే కనిపించింది. అయితే జంపా బంతిని అందుకున్నాక పరిస్థితి మారిపోయింది. తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (1) వికెట్ తీసిన జంపా… ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయిన స్టోక్స్, మొయిన్ అలీలను కూడా పెవిలియన్ కు తిప్పిపంపాడు. దాంతో ఇంగ్లండ్ ఓటమి బాటలోకి మళ్లింది.

చివర్లో క్రిస్ వోక్స్ (32), అదిల్ రషీద్ (20) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. వోక్స్ ను స్టొయినిస్ అవుట్ చేయగా, హేజెల్ వుడ్ బౌలింగ్ లో అదిల్ రషీద్ అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2, పాట్ కమిన్స్ 2, స్టొయినిస్ 1 వికెట్ తీశారు.

ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది. అటు, ఇంగ్లండ్ ఆరో ఓటమితో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

ANN TOP 10