హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తనకున్న 150 ఎకరాలకు ఏటా రూ.15లక్షల రైతుబంధు తీసుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే ధనికులకు, ఐటీ కట్టేవారికి రైతుబంధు రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పక్కన 5,800 ఎకరాల పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తానూ ఆర్ధిక మంత్రిగా పనిచేసిన కాలంలో మద్యంపై వచ్చే ఆదాయం రూ.10వేల కోట్లు ఉండగా.. నేడు దానిని రూ.45వేల కోట్లకుపైగా పెంచడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మద్యం సేవించడంలో నంబర్ వన్‌గా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులు కోల్పోయిన ఐఆర్, ఇతర సౌకర్యాలు పునరుద్ధరిస్తామని, వీఆర్‌ఏ, వీఆర్‌వోలతో పాటు ఇతర చిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి, గల్ఫ్ బాధితుల కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించి వారి ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో అభివృద్ధి పేరిట విధ్వంసం జరిగిందని, భూములు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యారని, వారి కన్నీళ్లు తుడిచే నాథుడే కరువయ్యాడని చెప్పారు. గజ్వేల్‌లో ధర్మ యుద్ధం సాగిస్తానని చెప్పారు. గరీబు బిడ్డగా నేను వారి డబ్బులతో పోటీ పడలేనని చెప్పారు. నా వెంట ఉండేవారికి సైతం నెల రోజుల పాటు ఎన్నికల్లో కష్టాలు తప్పవన్నారు. ధర్మం గెలవాలంటే తనతో కలసిరావాలని కోరారు.









