AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంక సంచలన విజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ఇదివరకే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట ఓడిన ఇంగ్లీష్‌ జట్టు తాజాగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఇంగ్లండ్‌ సెమీస్‌ రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్నట్టే. బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి పిచ్‌లో ప్రపంచ స్థాయి బ్యాటర్లు అయిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు దారుణంగా తడబడి 156 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 25.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టోర్నీలో రెండో విజయాన్ని నమోదుచేసింది. ఇంగ్లండ్‌కు ఇది ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగో ఓటమి.

స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (4)తో పాటు కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (11)లు త్వరగా నిష్క్రమించారు. ఈ రెండు వికెట్లు డేవిడ్‌ విల్లేకు దక్కాయి. 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లంకను మరో ఓపెనర్‌ పతుమ్‌ నిస్సంక (83 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (54 బంతుల్లో 64, 7 ఫోర్లు, 1సిక్సర్‌) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని మూడో వికెట్‌కు 122 బంతుల్లో 137 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు షాకిచ్చారు. నిస్సంకకు వరల్డ్‌ కప్‌లో ఇది వరుసగా నాలుగో అర్థ శతకం. వరల్డ్‌ కప్‌లో ఇదివరకే సెంచరీ చేసిన సమరవిక్రమకు ఇది రెండో అర్థ సెంచరీ కావడం విశేషం.

వికెట్ల కోసం ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రయత్నించినా ఛేదించాల్సిన లక్ష్యం మరీ చిన్నదిగా ఉండటంతో వాళ్లకు అవకాశమే లేకుండా పోయింది. రెండు వికెట్లు తీశాక బట్లర్‌.. లంకను ఒత్తిడిలోకి నెట్టేందుకు బ్యాటర్ల చుట్టూ ఫీల్డర్లను మొహరించినా సమరవిక్రమ, నిస్సంకలు సంయమనంతో ఆడి లంకకు విజయాన్ని అందించారు. మొదట్లో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడిన ఈ జోడీ తర్వాత పుంజుకుంది. అంతకుముందు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో దారుణంగా తడబడింది. బెన్‌ స్టోక్స్‌ (73 బంతుల్లో 43, 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. బట్లర్‌, రూట్‌, మలన్‌, లివింగ్‌స్టోన్‌, మోయిన్‌ అలీ లు విఫలమయ్యారు.

ANN TOP 10