AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

30 ఏళ్లనాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు..

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాత రోజుల్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు. విజయదశమి సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. మంత్రి బోయిన్ పల్లిలో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు సైతం పూజలు చేశారు. ఆ తర్వాత స్కూటర్‌ నడుపుతూ చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తాను గతంలో పాలు అమ్మిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

మంత్రి మల్లారెడ్డి గతంలో ఎన్నో సందర్భాల్లో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డానంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాను పాలమ్మినా స్కూటర్‌పైనే చక్కర్లు కొట్టి సరదాగా గడిపారు. తాను పాలమ్మి ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని స్కూటర్ నడుపుతూ గుర్తు చేసున్నారు మంత్రి. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నా.. ఆనాటి చేతక్‌ బండిని చూడగానే అప్పటి రోజుల్లోకి వెళ్లిపోయారు.

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డిది ఓ ప్రత్యేకతనే చెప్పాలి. అసెంబ్లీలో అయినా, బయటైనా తనదైన పంచ్‌లతో.. సరదా సంభాషణలతో సరదాగా గడుపుతుంటారు. స్కూటర్‌పై పాలమ్మే స్థాయి నుంచి ఎన్నో విద్యా సంస్థలు, వ్యాపారాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి మేడ్చల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లారెడ్డికి కేబినెట్‌లో స్థానం కల్పించారు.

ANN TOP 10