కేసీఆర్ అంటేనే సంక్షేమమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. పేదవాళ్ల మొహాల్లో చిరునవ్వు.. కండ్లలో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టాలంటే.. చారిత్రక కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ, తెగింపు ఉండాలని.. అల్లాటప్ప నాయకులతో విప్లవాత్మక పథకాలు రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం అనంతరం 76 ఏండ్లలో ఎవరూ పెట్టని విధంగా కేసీఆర్ నాయకత్వంలో దళితబంధు అనే విప్లవాత్మక పథకాన్ని పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు అందుతున్నదని తెలిపారు. బాబా సాహెబ్ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లున్నారని అన్నారు. కుల రహిత సమాజం, వివక్ష లేని సమాజం ఉండాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆకాంక్షతో సీఎం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇవాళ ఎవరో వస్తరు.. ఏదో చేస్తారనే ఆలోచన అక్కర్లేదని.. కచ్చితంగా తొందరలోనే మీరంతా శుభవార్త వింటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. పెన్షన్లు ఎంత పెంచాలి? ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలి? ఎవరెవరికి ఏమేమీ చేయాలి? ఈ పదేండ్లలో చేసినదానికి ఇంకా ఎక్కువ ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. తొందరలోనే మీకు ఆ శుభవార్త కూడా వస్తదని అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే.. రేపు భరోసాగా ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్లీ వచ్చేది.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు.









