ప్రధాని మోదీ టూర్ తర్వాత సడన్‌గా టాప్‌గేర్‌లోకి వచ్చిన తెలంగాణా బీజేపీ.. అదే దూకుడు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో.. జాతీయ నేతలంతా కొలువుదీరారు. తెలంగాణ బీజేపీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. అటు.. అసమ్మతిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలపై విమర్శల తాకిడి అమాంతం పెంచేశారు. వరుస సమావేశాలతో ఎన్నికలకు సమాయత్తమవుతోంది తెలంగాణా బీజేపీ. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, పదాధికారులతో సమావేశమయ్యారు జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. 18 అంశాల కార్యాచరణపై చర్చించి ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారు చేశారు.
శుక్రవారం మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ తెలంగాణా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ కీలక నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ భన్సల్, తరుణ్ చుగ్… తెలంగాణాలో ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ..ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టాలన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా గరిబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు.
ఇందులో తెలంగాణకి చెందిన రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని.. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్‌లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారని అన్నారు. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ను ఎందుకు అబివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను నిర్మించిందని.. మరీ తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని నిర్మించారో చెప్పాలని అన్నారు.
ఏడాదికి 6వేల కోట్లతో రైతుల ఖాతాలో కిసాన్ సమ్మన్ నిధి జమ అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. దీంట్లో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారని.. తెలంగాణ కి మోదీ ఇచ్చిన వాటన్నింటినీ చెప్పాల్సిన అవసరం ఉందా..? లేదా..? అని జేపీ నడ్డా ప్రశ్నించారు.
తెలంగాణ లో బీజేపీ గెలవాలి .. దాంతో పాటు మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తేవాలన్నారు జేపీ నడ్డా. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్ సంఖ్య పెరిగిందన్నారు. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో కొద్దిగా చూడాలని.. తొమ్మిది ఏళ్లలో 9లక్షల కోట్లను తెలంగాణకు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
రెండు రోజుల్లో 20వేల కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేశారని.. మరీ ఇక్కడున్న కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే కేసిఆర్ ను గద్దె దించల్సిన అవసరము ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
పదవ తరగతి క్వశ్చన్ పేపర్, tspsc పేపర్ లీకేజి లకు పాల్పడిన ప్రభుత్వాన్ని తెలంగాణలో గద్దె దింపల్సిన అవసరం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి తో 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటం అడుకున్నారని విమర్శించారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్ నీకు సిగ్గు ఉందా అని నిప్పులు చెరిగారు.









