సిక్కిం వరదల్లో 14 మంది మరణించరు. మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి. 22వేల మంది వరద బారినపడ్డారని సిక్కిం అధికారులు చెప్పారు.
ఎగువన వర్షాలు కొనసాగడం, ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరగడంతో సిక్కింలో పలు చోట్ల డ్యామ్ దెబ్బతింది. డ్యామ్ భాగాలు కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మంగళవారం అర్ధరాత్రి డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో.. సింగ్టమ్‌లోని బర్దంగ్ దగ్గర ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది. వరదలో అదృశ్యమైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దిగి సహాయ సహకారాలను అందిస్తోంది. వరదల కారణంగా 10వ నంబర్ జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. తీస్తా నది నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. సీఎం నుంచి పరిస్థితిపై ప్రధాని సమాచారం తీసుకున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కూడా సిక్కింలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 48 గంటల్లో సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.









