రగులుతున్న అసమ్మతి జ్వాల
మోదీ సభకూ ముఖ్య నేతలు దూరం
నేతల మధ్య కానరాని సఖ్యత
ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమలంలో ఏం జరుగుతోంది.. కీలక నేతలంతా అసంతృప్తిగా ఉన్నారా?.. నేతల మధ్య సఖ్యత లోపించిందా?. పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారా?.. మోదీ సభకు చాలా మంది గైర్హాజరు చూస్తుంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. కమలంలో కల్లోలం నెలకొందని సొంత పార్టీ నాయకులే బాహాటంగా చెబుతుండటం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు సభలో ఎక్కడా కనిపించలేదు. ఈ నేతల గైర్హాజరు గురించే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీరంతా బీజేపీ హైకమాండ్‌పై అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తవారికి పెద్ద పెద్ద పదవులు ఇస్తూ.. తమను అధిష్టానం అస్సలు పట్టించుకోవట్లేదన్నది ఈ నేతల అభిప్రాయమని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే.. ఇక కేంద్రం నుంచి ఎంత పెద్దోళ్లు వచ్చినా సరే కలవడం, సభకు హాజరుకావడం వంటి వాటికి దూరంగా ఉండాలని ఈ ముఖ్యనేతలంతా నిర్ణయించుకున్నారని టాక్..
ఈ మధ్యే అసంతృప్త నేతలంతా అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమై.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్టానం వైఖరిపై చర్చించారు. బీఆర్‌ఎస్ పట్ల కఠిన వైఖరి అనుసరించకపోవడంతో ‘బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటే’ అన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతోందని వారు అభిప్రాయపడ్డారు. ‘ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులంతా బీజేపీ వైపు మొగ్గుచూపారు. అయితే, వారిని పార్టీ దూరం చేసుకుంటోంది. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదని అధినాయకత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది.. అయినా ఎందుకు జాప్యం జరుగుతుందో అంతుచిక్కడం లేదు’ అని ఒకరిద్దరు నేతలు అన్నట్లు సమాచారం. అధిష్టానం స్పందన కోసం రెండు, మూడు రోజులు వేచి చూడాలని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అధినాయకత్వం వైఖరి స్పష్టం కాకపోవడంతో అసంతృప్త సీనియర్లు వరుస భేటీలు నిర్వహించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అధిష్టానం తీరు మారక పోతే.. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్‌లోకి వెళ్లారని.. మరోవైపు విజయశాంతి, వివేక్‌లు కూడా సొంత గూటికి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. అసమ్మతి నేతలంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎటువైపు అడుగులేస్తారో వేచి చూడాల్సిందే.









