AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దసరాకు 5265 ప్రత్యేక బస్సులు.. 13 నుంచి 25 వరకు..

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తోంది. సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేసింది. ఈనెల 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్‌ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్రకు ప్రత్యేక బస్సులు టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌ బీ కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.

పండుగ రోజుల్లో ఎంజీబీఎస్‌-ఉప్పల్‌, ఎంజీబీఎస్‌-జేబీఎస్‌, ఎంజీబీఎస్‌-ఎల్బీనగర్‌ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్‌, స్పెషల్‌ సర్వీసులను ఎంబీజీఎస్‌ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్‌ నుంచి బయలుదేరుతాయి.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ వైపునకు వేళ్లేవి జేబీఎస్‌, పికెట్‌ నుంచి వెళ్తాయి. వరంగల్‌, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్‌, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్‌ నుంచే నడుస్తాయని టీఎస్‌ఆర్టీసీ సంస్థ తెలిపింది.

ANN TOP 10