మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం అమిస్తాపూర్‌లో ఆదివారం బీజేపీ బహిరంగ సభ జరిగింది. లక్షన్నర మంది జనం సమక్షంలో ఆవేశంగా ప్రసంగించారు ప్రధాని మోదీ. పాలమూరు ప్రజలకు నమస్కారారాలు అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టి.. తెలంగాణా గడ్డపై వరాల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటుపై స్పష్టతనిచ్చారు. రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే ఈ బోర్డుకు కట్టుబడి ఉన్నామని మాటిచ్చారు మోదీ. తెలంగాణాకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ. ములుగు జిల్లాలో 900 కోట్ల ఖర్చుతో ఏర్పాటయ్యే ఈ విద్యాసంస్థకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అని నామకరణం కూడా చేశారు మోదీ.
తెలంగాణాలో మిగతా ప్రధాన పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, బీఆర్‌ఎస్, మజ్లిస్ పొలిటికల్ పార్టీలు కాదు.. ప్రైవేటు కంపెనీలని విమర్శలు గుప్పించారు. అంతకుముందు… గుజరాత్‌నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఓపెన్‌టాప్ జీపులో పాలమూరులో పర్యటించారు ప్రధాని మోదీ. దారిపొడవునా బీజేపీ మహిళా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 13 వేల 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
జాతీయ కమలనాథులకు పాలమూరుపై స్పెషల్ ఫోకస్ ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడినుంచే ప్రచారం మొదలుపెట్టారు మోదీ. అదే సెంటిమెంట్‌ని ఈసారి కూడా రిపీట్ చేశారు. తొలి ప్రాధాన్యతగా తెలంగాణా రాష్ట్రాన్నే తీసుకున్నారు. పైగా.. ఇక్కడ ఆరునెలల ముందుగా ఎన్నికలు జరుగుతున్నాయి కనుక… ఆలస్యం అమృతం విషం అనుకున్నారో ఏమో ఎన్నికల శంఖారావం ఇక్కడినుంచే పూరించారు కమలనాథులు. మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా.. ఇక నాన్‌స్టాప్ టూర్లతో తెలంగాణా గడ్డను హోరెత్తించబోతున్నారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవ్‌దేకర్, రాష్ట్ర ఇన్‌చార్జులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్.. ఇకమీదట తెలంగాణాలోనే ఎక్కువ సమయం మకాం పెడతారని తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి… పోలింగ్ తేదీ దాకా.. విరామం లేకుండా శ్రమించేలా పార్టీ లీడర్లకు, క్యాడర్‌కీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది తెలంగాణా బీజేపీ. 4, 5 తేదీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగబోతోంది. ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న ఆరువేలమంది ఆశావహుల్లో సాలిడ్ క్యాండేట్ల కోసం వడపోత షురూ చేస్తారు. ఆరోతేదీన జరిగే విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా తాము కూడా దూకుడు పెంచాలన్నదే కమలం పార్టీ ఆలోచన.









